నువ్వుల పొడి .

Listen to the NEWS

ఈ నువ్వుల పొడి తయారు చేయడానికి తెల్ల నువ్వుపప్పు వాడాలి .

తెల్ల నువ్వుపప్పు తో నువ్వుల పొడి చాలా రుచిగా ఉంటుంది .

తెల్లనువ్వు పప్పు పచారీ షాపులన్నింటిలోనూ దొరుకుతుంది . నూనె తీసే గానుగల వద్ద కూడా ఈ నువ్వు పప్పు అమ్ముతారు.

మేము గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఒకేసారి రెండు కిలోలు తెచ్చుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటాము. వాడకాన్ని బట్టి మాకు ఐదారు నెలలు వస్తుంది . అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాము. ఫ్రిజ్ లో పెట్టుకుంటే నువ్వుపప్పు పురుగు పట్టదు.

ఇక ఈ నువ్వుల పొడి రెండు పద్ధతులలో తయారు చేసుకొనవచ్చును.
మొదటి పద్ధతి స్టౌ వెలిగించి నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు నూనె వేయకుండా బాండీలో వేయించుకోవాలి.
తర్వాత వేయించిన పప్పును మరియు తగినంత ఉప్పును మిక్సీ లో వేసుకుని మెత్తని పొడిగా మిక్సీ వేసుకోవాలి.
ఈ పొడి భోజనము లోకి , ఇడ్లీ మరియు దోశెల లోకి చాలా రుచిగా ఉంటుంది.
బీరకాయ మరియు ఆనపకాయ వంటి కూరలు ఉడకపెట్టి పోపు వేసుకుని , ఈ పొడి చల్లుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది.

ఇక రెండవ పద్ధతిలో నువ్వు పప్పుతో పాటుగా పల్లీలు , ఎండు కొబ్బరితో కలిపి పొడి కొట్టుకుంటారు.
ఈ పొడి భోజనము, ఇడ్లీలు , దోశెలు , గారెలు మరియు చపాతీల లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .
పైగా ఈ పొడి అన్ని వేపుడు కూరలు అనగా బెండకాయ , దొండకాయ, బంగాళాదుంప మరియు చామదుంప వంటి వేపుడు కూరలలోను చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

రెండవ పద్ధతిలో ఆ విధముగా చేసిన నువ్వుల పొడి

తయారీ విధానము .

కావలసినవి.
నువ్వుపప్పు – 100 గ్రాములు.
ఎండుమిరపకాయలు – 15
నూనె వేయకుండా వేయించి పై పొట్టు తీసిన పల్లీలు – 50 గ్రాములు.
చాయ మినపప్పు – మూడు స్పూన్లు .
ఎండు కొబ్బరి – పావు చిప్ప. చిన్నముక్కలుగా తరుగు కోవాలి.
ధనియాలు – స్పూనున్నర .
జీలకర్ర – స్పూను
చింతపండు – షుమారు 15 గ్రాములు.
ఉప్పు – తగినంత .
నూనె – నాలుగు స్పూన్లు .

తయారీ విధానము.

స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి.

నూనె బాగాకాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు , జీలకర్ర , వేయించిన పల్లీలు , నువ్వుపప్పు మరియు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

చల్లారగానే మిక్సీ లో ఈ వేయించిన మిశ్రమము మొత్తము , చింతపండు మరియు తగినంత ఉప్పును వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి.

ఈ నువ్వుల పొడి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.